రాజధానికి సంబంధించిన పిటీషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటి వరకు 80 పిటీషన్లకు పైగా దాఖలయ్యాయి. వీటన్నిటిపై విచారణ ఉన్నత న్యాయస్థానం జరపనుంది. మరికొన్ని పిటీషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. రాజధాని అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, విశాఖలో నూతన భవన నిర్మాణంపై గత విచారణలో వాదనలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకే విశాఖలో అతి పెద్ద భవనం నిర్మిస్తున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనికి స్పందించిన ఏజీ ప్రభుత్వం విడిది గృహం నిర్మిస్తుందని.. అన్ని కేటగిరిల అధికారులు ఉండేందుకు వీలుగా నిర్మిస్తున్నట్లు ధర్మాసనానికి తెలిపారు. వీటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. వీటితో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దాఖలు చేయాల్సిన అన్ని వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజధానికి సంబంధించిన అంశాలపై అత్యధికంగా పిటీషన్లు దాఖలవటంతో విచారణ ప్రత్యక్షంగానా లేక ఆన్లైన్ ద్వారా కొనసాగించాలా అనే అంశంపై గత విచారణలో చర్చించారు.
ఇదీ చదవండీ... సీఎంఆర్ఎఫ్ పేరిట నకిలీ చెక్కులు... కేసు నమోదు చేసిన పోలీసులు