ప్రాథమిక విద్యాబోధన తెలుగుభాషలోనే జరగాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. 'తెలుగు మాట్లాడటం రాదు' అంటే అదో గొప్ప స్థాయి అనే భ్రమలో నుంచి తెలుగు వారు బయటకు రావాలని సూచించారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య శుక్రవారం నుంచి మూడురోజుల పాటు 'తెలుగు నుడి-బడి' అనే అంశంపై జూమ్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి చర్చావేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆంగ్ల సంప్రదాయాల వైపు వెంటపడే సంస్కృతి నుంచి బయటపడాలని ఉద్బోధించారు. ఈ చర్చావేదిక నివేదికను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకూ అందజేయాలని సూచించారు.
తెలుగును పరిరక్షించేందుకు భాషాభిమానులు ప్రయత్నించాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి చెప్పారు. జాతీయ విద్యా విధానం ప్రకటించిన నేపథ్యంలో.... రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చక్కని కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తెలుగు విద్యాలయాలపై అక్కడి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టేలా అందరూ కృషి చేయాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వ అదనపు ముఖ్యకార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ అన్నారు. ఉద్వేగాల్ని, ఆనందాన్ని, ప్రేమాభిమానాన్ని మనసుకి దగ్గరగా వ్యక్తీకరించడంలో తెలుగుభాష ఎంతో గొప్పదని విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు కొనియాడారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యాబోధన తెలుగు మాధ్యమంలో జరిగితే పిల్లల మనోవికాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యా విధానం ప్రకారం ఐదో తరగతి వరకు బోధన మాతృభాషలోనే ఉండాలన్నారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్, రవీణా చవాన్, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పోలవరం నిధుల్లో మరింత కోత?