ఆర్టీఐ యాక్టివిస్ట్ వెంకట్రావుపై ప్రకాశం జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ కేసులో ఆర్టీఐ కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది. ఆర్టీఐ దాఖలు చేసిన తనపై నిఘా ఉంచాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం మీద వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగిన కొందరిపై నిఘా ఉంచాలని నిబంధనలకు విరుద్ధంగా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరారు.
ఆదేశాలు జారీ చేయడంపై ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. ఆర్టీఐ కమిషనర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చామని కలెక్టర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. సమాచారం అడిగిన వారిపై నిఘా ఉంచడంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. కలెక్టర్ ఆదేశాలను సస్పెండ్ చేసింది. ఆర్టీఐ కమిషనర్‌ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి : న్యాయస్థానాల్లో వారికి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది: హైకోర్టు