‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి నిర్మాణానికి 50 బస్తాల సిమెంటును అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంటును రూ.235-రూ.240 చొప్పున ధరతో లబ్ధిదారులకు ఇస్తోంది.
ఈ మొత్తం సరిపోవడం లేదని, బహిరంగ మార్కెట్లో బస్తా ధర రూ.400కు చేరినందున కొనుక్కోవడం భారమవుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో రాయితీపై మరో 50 బస్తాలను అదనంగా ఇవ్వాలని, ఈ మొత్తాన్ని ఇంటి నిర్మాణ రాయితీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రాయితీ రూ.1.80 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం 4 విడతలుగా లబ్ధిదారులకు ఇస్తోంది. ఇప్పటివరకు బేస్‌మెంటు పూర్తయిన తర్వాత మొదటి విడతగా రూ.70వేలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే నిర్మాణం ప్రారంభించేటప్పుడే కొంత మొత్తం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీంతో పునాది తవ్విన వెంటనే రూ.15వేలు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బేస్‌మెంటు పూర్తయ్యాక రూ.55వేలు, రూఫ్ వరకు చేరాక రూ.50వేలు, రూఫ్‌కాస్ట్ పూర్తి చేశాక రూ.30వేలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత చివరి విడతగా రూ.30వేల చొప్పున ఇవ్వనుంది.
ఇదీ చదవండి : చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది: గవర్నర్ భిశ్వభూషణ్