కరోనా చికిత్సకు వెయ్యి రూపాయలు దాటితే ఖర్చు భరిస్తామన్న ప్రభుత్వం చేతులెత్తేసిందని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. లక్షలు ఖర్చు పెడుతున్నా ప్రాణాలు దక్కని పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ మొదటి నుంచి కరోనా తీవ్రతను తక్కువగా అంచనా వేసి చులకనగా చూడటం వల్ల సమస్యలు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారితో చంద్రబాబు వెబినార్ నిర్వహించారు.
కరోనా కేసుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో పాటిటివ్ రేటు 10.91శాతం ఉంటే జాతీయ స్థాయిలో సగటు రేటు 7.87శాతం ఉందని చంద్రబాబు వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్న 30జిల్లాల్లో 5ఏపీలోనే ఉన్నాయని, ఉభయగోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలతో ఫలితాలు రావని ప్రపంచమంతా చెప్తున్నా.. ఇంకా అవే పరీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు ఉండే ప్రమాదం ఉందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య నివారణకు సమీక్షలు కూడా పెట్టలేదని ధ్వజమెత్తారు. ఏం జరిగితే అది జరుగుతుందనే ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరించటం వల్లే అనేక సమస్యలు వచ్చాయన్నారు. అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేశారని, రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే చాలా నష్టం, ఇబ్బందులు తగ్గేవని చంద్రబాబు అన్నారు.
ఇదీ చదవండీ... ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు పెట్టలేం : కొడాలి నాని