రాష్ట్ర ఆర్థిక కష్టాలు తీవ్రమవుతున్నాయి. జీతాలు, పింఛన్లు చెల్లించేందుకూ నిధుల కోసం ప్రభుత్వం వెదుకులాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతినెలా ఐదారు వేల కోట్ల రుణం తీసుకుంటే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదు. కొత్తగా ఏదైనా అభివృద్ధి పథకం చేపట్టాలన్నా... ఏదో రూపంలో అప్పు చేయాల్సిందే. నిధుల కోసం ఏదో ఒక ఆర్థికసంస్థను ఒప్పించాల్సిందే. ఆ అప్పు కూడా గతంలో లాగా సులభంగా పుట్టడం లేదు. రాష్ట్రంలోని తాజా పరిస్థితుల దృష్ట్యా అనేక రకాల భరోసాలు తీసుకొని మాత్రమే ఆర్థిక సంస్థలు అప్పులిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ రుణానికి భారీగా కోత పెట్టింది.
'అప్పుల పరిమితి దాటిపోయింది'
ఎడాపెడా అప్పులు చేసి ఏదోలా గడిపేద్దామనుకునే రాష్ట్రాల రుణ ప్రయత్నాలను గాడిన పెట్టేందుకు.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను పక్కాగా అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం 2021-22లో రాష్ట్ర నికర రుణ పరిమితిని 27 వేల 688 కోట్లకే కట్టడి చేసింది. రాష్ట్ర అప్పుల పరిమితి ఇప్పటికే దాటిపోయిందంటూ కేంద్రం లెక్కగట్టింది. రెండేళ్ల కిందటే పరిమితికి మించి దాదాపు 17 వేల 923 కోట్లు రుణంగా పొందారని గుర్తించింది. కేవలం రెండు ఆర్థిక సంవత్సరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఈ లెక్కలు కట్టింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల లెక్కలు మదింపు చేయకపోవడం వల్ల.. ఈ మాత్రమైనా రుణానికి అవకాశం దక్కింది. తాజా గణాంకాలూ సమర్పిస్తే కొత్త అప్పులకు కోత పడేదని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు సమర్పించాలి..
2021-22లో బహిరంగ మార్కెట్ రుణ పరిమితిని ఖరారు చేసేందుకు.. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. 2017-18 నుంచి 2020-21 వరకు ఏ రూపంలో అప్పు చేసినా, ఆ వివరాలు సమర్పించాలని కోరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదిక సమర్పించింది. మే నెలలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినందున... అప్పటికి 2019-20, 2020-21 లెక్కలు తేలలేదు. ఆ రెండేళ్ల వివరాలు రాష్ట్రం సమర్పించలేదని తెలిసింది. ఈ లెక్కలు తుదిదశలో ఉన్నాయని సమాచారం. ఈ కారణంగా కేంద్రం నికర రుణ పరిమితి తేల్చే క్రమంలో గత రెండేళ్ల లెక్కలు పరిగణనలోకి తీసుకోలేదు. అవి కూడా కలిపితే ఆ ప్రభావం భవిష్యత్తులోనూ తప్పదని ఆర్థిక శాఖ చెబుతోంది.
దాటిపోయిన గ్యారంటీల పరిమితి..
ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు సమర్పించి రుణాలు పొందుతోంది. ఆ కార్పొరేషన్లను కంపెనీ చట్టం కింద నెలకొల్పి అవే వ్యాపారాలు చేసి, సొంతంగా రుణాలు తిరిగి చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. కార్పొరేషన్లకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల పరిమితి కూడా ఈ ఏడాది దాటిపోయింది. దీని వల్ల కొత్తగా గ్యారంటీలు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర రుణాలు జీఎస్‌డీపీలో 4శాతానికి మించకూడదన్న ఆర్థిక సంఘం నిబంధన ప్రకారం చూస్తే.. కార్పొరేషన్ల పేరిట చేసిన రుణాలనూ అందులోనే పరిగణించాలి. కార్పొరేషన్ల రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రావని పేర్కొంటున్నా అవి రుణాలు స్వయంగా చెల్లించని వైనాన్ని గమనిస్తే.. ఆ భారమూ రాష్ట్ర బడ్జెట్‌పైనే పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఈనెల జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్‌దారులు సైతం పూర్తిగా పెన్షన్ అందక బ్యాంకు ఖాతాల ఎస్ఎంఎస్ల కోసం నిరీక్షిస్తున్నారు. మరోపక్క రిజర్వ్ బ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం 2 వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం స్వీకరించింది. ఈ మొత్తం బుధవారం రాష్ట్ర ఖజానాకు జమ కానుందని సమాచారం. జీతాలు, పెన్షన్ల సమస్య నేటి సాయంత్రానికి కొలిక్కి రావచ్చని తెలుస్తోంది.
కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి తీసుకునే రుణం ఆధారంగా నెలకు 2వేల 305 కోట్లు అప్పు చేసుకునే వెసులుబాటు రాష్ట్రానికి కల్పించింది. ఆ లెక్కన తొలి 9 నెలలకు కలిపి 20వేల 751 కోట్లు అప్పు పొందేందుకు అవకాశం ఉంది. కానీ రాష్ట్రం ఒక్క నెలలోనే 7వేల కోట్ల వరకు అప్పు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. మంగళవారం పొందిన 2వేల కోట్లతో కలిపితే తొలి 4 నెలల్లో 17వేల కోట్లు బహిరంగ మార్కెట్ అప్పుగా స్వీకరించింది. అప్పు తీసుకుంటే తప్ప జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దశలో.. 9నెలల పరిమితికి జులైలోనే చేరువైతే ఆగస్టు నుంచి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం.
ఇదీ చదవండి:
విశాఖ: అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి