వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న మండలి ఛైర్మన్ నిర్ణయంతో రాజధాని రైతులు సంబరాలు చేసుకున్నారు. మందడం, మల్కాపురం, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఐనవోలు సహా ఇతర గ్రామాల ప్రజలు... మందడం ప్రధాన కూడలి చేరుకుని బాణసంచా పేల్చారు. జాతీయజెండాలు పట్టుకుని ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు చేశారు. మండలి నుంచి బయటకు వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి... జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
పోరాటం ఆగదు
క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు దూరంగా ఉన్న తమకు... అన్ని పండుగలూ ఒకేసారి వచ్చినట్లుందని రైతులు అన్నారు. అలుపెరగని పోరాటం సాగించిన అన్నదాతలు... మండలి నిర్ణయంతో ఒక్కరోజైనా కంటినిండా నిద్రపోతామని అంటున్నారు. మండలి ఛైర్మన్ చిత్తశుద్ధితో వ్యవహరించారని కొనియాడుతున్నారు. మండలి ఛైర్మన్ నిర్ణయం తాత్కాలిక ఊరటే అయినందున.. పోరాటం విషయంలో ఆగేది లేదని రైతులు స్పష్టం చేశారు.
నేడూ నిరసనలు
37వ రోజైన ఇవాళ ఆయా ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు యధాతథంగా కొనసాగనున్నాయి. మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు... వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ఉద్దండరాయినిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతుల పూజలు... ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాల్లో ఆందోళనలు జరగనున్నాయి.
ఇదీ చదవండి:సెలెక్ట్ కమిటీకి రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు