రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బీమా మాఫీయాలో భాగస్వామ్యం ఉన్న నిందితులను విచారిస్తున్న క్రమంలో.. మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన 20 మందికి పైగా నిందితులను.. నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకుని నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో 2013 నుంచి వారు చేసిన ఘోరాలన్నింటినీ పోలీసులకు వెల్లడిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు 10 మంది వరకు అమాయకులను హత్య చేసి... వారు ప్రమాదాల్లో మృతి చెందినట్లు చిత్రీకరించి బీమా సొమ్ము తీసుకున్నారు.
నిందితులు మిర్యాలగూడ, నల్గొండ డివిజన్‌తోపాటూ ఏపీలోని దాచేపల్లి, మాచర్ల ప్రాంతాల్లో మరింత మందిని ఈ విధంగానే పొట్టనబెట్టుకున్నట్లు అంగీకరించినట్లు తెలిసింది. గత ఏడాది కాలంలో ఆయా ప్రాంతాల్లో అనుమానస్పదంగా మరణించిన వారి వివరాలతోపాటూ.. తక్కువ సమయంలో బీమా క్లైయిమ్‌లు పొందిన వివరాలు సైతం నల్గొండ పోలీసులతో ఏపీ పోలీసులు పంచుకుంటున్నారు. కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతుండటంతో కొంత ఆలస్యమైనా... నిందితుల నుంచి పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే.. వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టాలని నల్గొండ ఎస్పీ రంగనాథ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : సంస్కరణల బాటలో కేంద్రం దూకుడు