రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో ఉమ్మడి రాష్ట్రంలో 1999 గ్రూపు-2లో ఎంపికై ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న 30 మంది అధికారులు కలవరపడుతున్నారు. నాడు సబ్‌రిజిస్ట్రార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితర 900 పోస్టుల భర్తీకి రాతపరీక్షలు జరిగాయి. ఆ తర్వాత వారి నియామకాలపై వివిధ వివాదాలు తలెత్తాయి. గత నెల 14న సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులిచ్చింది. దాని ప్రకారం ఏపీపీఎస్సీ 2018లో విడుదల చేసిన నియామక జాబితాను అమలు చేయవలసిందిగా బుధవారం ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన విభాగం అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ జాబితాను కచ్చితంగా అమలుచేస్తే తెలంగాణలోని 30 మంది ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రార్లు, డీసీటీవోలు, ఆబ్కారీ ఉన్నతాధికారులు ఏపీకి వెళ్లాలి. అక్కడ ఉన్న ఖాళీల ఆధారంగా వారిలో కొందరికి హోదా తగ్గుదల ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆర్డీవో ఏపీకి వెళితే ఇప్పుడు ఈవో పీఆర్‌డీగా హోదా తగ్గనున్నట్లు తెలిసింది. ఒకరిద్దరికి హోదా పెరిగే అవకాశం ఉంది. ఏపీలో చేరాలని అక్కడి నుంచి ఆదేశాలు వస్తే వాటిని వ్యతిరేకించాలని తెలంగాణలోని అధికారులు నిర్ణయించారు.
ఒకటి, రెండు రోజుల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్‌లను కలవాలని భావిస్తున్నారు. ఏపీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి రప్పిస్తున్న తరుణంలో తాము ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లేది లేదని చెబుతున్నారు.