గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల సాధారణం కంటే 4.5 డిగ్రీల మేర పెరిగాయి. ఒక పక్క ఎండలు..మరో పక్క వానలు. వీటికి తోడు ఉక్కపోత. దాంతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరైంది. గులాబ్, షహీన్ తుపాన్ల ప్రభావంతో తేమ గాలులన్నీ అటు వైపు వెళ్లడంతో సముద్రం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ వైపు వేడిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగాయి. దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య, తూర్పుగాలులు, ఉత్తర కోస్తా, యానాంలో వాయువ్య, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దీంతో ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గవచ్చు.
కామవరపుకోటలో 6.95 సెం.మీ వర్షం
సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిశాయి. గరిష్ఠంగా పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో 6.95సెం.మీ వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో 5.6, విజయవాడలో 5.6, అనంతపురం జిల్లా గుంతకల్లులో 4.95, ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో 4.75 సెం.మీ చొప్పున వానలు పడ్డాయి. విశాఖపట్నం జిలా గొలుగొండ, కృష్ణా జిల్లా జి.కొండూరు ప్రాంతాల్లో 4 సెం.మీ పైనే వర్షం కురిసింది. మరో పక్క కర్నూలు జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 38.9, గోనవరంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉభయగోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో పలు చోట్ల 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 4.5, మచిలీపట్నం 4.0, అనంతపురంలో 3.5, కావలిలో 3.0, విశాఖలో 2.9 డిగ్రీల చొప్పున అధికంగా ఎండలు కాచాయి.
ఇదీ చదవండి: polavaram:పోలవరం నిధులపై మళ్లీ కొర్రీ