ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తాము వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్రానికి చెందిన తెలుగు పండితులు, కవులు, సాంస్కృతిక కార్యకర్తలు గురువారం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ, శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు, కవి, సినీ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తెలుగు స్కాలర్ పాలపర్తి శ్యామలానంద, కవులు వద్దిపర్తి పద్మాకర్, డాక్టర్ డి.విజయ్‌భాస్కర్‌ల తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ విపిన్ నాయర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకురావడం విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ ఎనిమిది ప్రకారం తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారని తెలిపారు. ఆంగ్లమాధ్యమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే తెలుగు భాషపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. మాతృభాషలో విద్యాబోధన ప్రాముఖ్యాన్ని గుర్తించే ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషన్‌లో వివరించారు.
ఇదీ చదవండి