TS MLC Elections Polling: తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 26 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 37 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరిగింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు కొవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ జరిగింది.
ఉమ్మడి మెదక్ జిల్లా..
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1026 ఓటర్లకు గానూ.. 1018 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా.. పోలింగ్ 99.22 శాతం నమోదైంది. జహీరాబాద్, నారాయణఖేడ్, తూప్రాన్, సిద్దిపేట పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదైంది. సీఎం కేసీఆర్ మినహా ఎక్స్ అఫిషియో సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1324 ఓటర్లు ఉండగా.. 1320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా 99.69 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 205 మంది ఓటర్లకు గానూ.. ఎంపీ బండి సంజయ్ మినహా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంథనిలో 98 ఓట్లుండగా.. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మినహా.. అందరూ ఓటేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 201 మంది ఓటర్లుండగా.. 200 మంది ఓటేశారు. హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, హుస్నాబాద్ పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి కేటీఆర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే క్యాంపునకు తరలివెళ్లిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని ఓటేశారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ , తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీలతో కలిసి వచ్చి ఓటు వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 96.09 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మంలో ఎంపీ నామ నాగేశ్వరరావు, సీఎల్పీనేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మల్‌లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు ఓటు వేశారు.
- ఇవే కాకుండా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 97.01 శాతం పోలింగ్ నమోదైంది.
మిగతా ఆరు స్థానాలు ఏకగ్రీవమే..
మిగతా ఆరుస్థానాల్లో ఇప్పటికే నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, మహబూబ్‌నగర్ జిల్లాలో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవమయ్యారు. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఇదీ చూడండి: trs leaders internal fight: తెరాస నేతల వర్గపోరు.. మంత్రి ఎదుటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాగ్వాదం