తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ‘‘అంతర్జాతీయ తెలుగు భాషా పక్షోత్సవం’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి(29 ఆగస్టు) నుంచి కాళోజీ జయంతి(13 సెప్టెంబరు) వరకూ ఈ పక్షోత్సవాలను నిర్వహించనుంది. 40 రాష్ట్రేతర తెలుగు సంస్థల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యక్రమాలను జూమ్ యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు, ప్రధాన కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలోని రాష్ట్రేతర సంస్థలు శనివారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాయని వెల్లడించారు. ఆగస్టు 29 నుంచి 13 సెప్టెంబరు మధ్య ప్రతి శని, ఆదివారాల్లో కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. సుమారు వెయ్యి మంది భాషావేత్తలు, కవులు పక్షోత్సవాల్లో పాల్గొంటారని, 25 వేల మంది వరకూ వీక్షిస్తారని వివరించారు.
యువతను ఆకర్షించడమే లక్ష్యంగా...
దేశ, విదేశాల్లోని యువతను తెలుగు భాష, సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యేలా చేయడం, రాబోయే తరాలకు వాటిని అందించడం లక్ష్యంగా ఈ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సమాఖ్య వెల్లడించింది. సుమారు 40 మంది సాంకేతిక నిపుణులు కార్యక్రమ నిర్వహణకు ముందుకొచ్చారని, మరో 40 మంది భాషాభిమానులు సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ప్రారంభ, ముగింపు సభల్లో హైకోర్టు న్యాయమూర్తులు, రాజ్యసభ సభ్యులు, మండలి బుద్ధ ప్రసాద్, సినీ నటి జమున, తానా అధ్యక్షుడు జయ్ తాళ్లూరి, సినీ, గేయ రచయితలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొంది.
వివిధ కార్యక్రమాల తేదీలు..
సహస్రావధానులు, శతావధానులతో అష్టావధానం సెప్టెంబరు 10: విశ్వనాథ సత్యనారాయణ 125వ జయంతివేడుకలు సెప్టెంబరు 12: ప్రత్యేక సాహిత్య సమ్మేళనం, ఆంధ్ర మహిళా సభ సంగీత కళాశాల వారితో తెలుగు లలిత, జానపద గీతాలు, తెలుగులో భాష, విద్యా సమస్యలపై భాషా వేత్తలు, ప్రముఖులు, వివిధ రాష్ట్రేతర ప్రతినిధులతో చర్చా కార్యక్రమాలు, తీర్మానాలు ఉంటాయి.