తెలంగాణ తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో నిందితులు.. రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ సంస్థల నుంచి 14 కోట్ల 50 లక్షల రూపాయలను కాజేసినట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై సంబంధింత అధికారులకు సమాచారమివ్వగా... ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఏపీ గిడ్డంగుల కార్పొరేషన్ నుంచి 9 కోట్ల 50 లక్షల, ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి ఐదు కోట్ల రూపాయలు మళ్లించినట్లు విచారణలో తేలింది. కార్పొరేషన్ నిధులు గల్లంతయ్యాయని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ శ్రీకంఠ నాథ్ రెడ్డి తెలిపారు. కార్పొరేషన్ కు చెందిన 32 కోట్ల రూపాయలు ఎఫ్డీ రూపంలో ఉన్నాయన్నారు. భవానీపురంలోని ఐవోబీ నుంచి 9 కోట్ల 50 లక్షల రూపాయలు దారి మళ్లించినట్లు వెల్లడించారు. ఎఫ్డీలు మెచ్యూర్ కాకముందే నిధులు తరలించినట్లు తెలిపారు. సంబంధిత సంస్థకు చెందిన అధికారి ఉన్నతాధికారుల సంతకాన్ని ఫోర్జరీ చేసి గోదాముల సంస్థ పేరుతో మరో ఖాతా సృష్టించి మళ్లించినట్లు గుర్తించారు. వీరపనాయునిగూడెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 5 కోట్ల రూపాయలను ఆయిల్ ఫెడ్ సంస్థ నుంచి కొట్టేసినట్లు మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వరుస కుంభకోణాల నేపథ్యంలో అన్ని శాఖల పరిధిలోని ఎఫ్డీ పరిస్థితిని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి రానున్న నదీయాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్