ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆధునీకరణ, విస్తరణ పనులను నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(krmb)ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్(ts letter to krmb chairman)కు తెలంగాణ నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. ఈ విషయమై గతంలోనే తాము బోర్డుకు ఫిర్యాదు చేశామన్న తెలంగాణ.. బోర్డు, అత్యున్నత మండలి ఆమోదం లేకుండా ప్రాజెక్టు విస్తరణ చేపట్టిందని పేర్కొంది. ప్రవాహ సామర్థ్యం పెరిగేలా జీఎన్ఎస్ఎన్ ప్రధాన కాల్వకు మరమ్మతులు, విస్తరణ, లైనింగ్ పనులు చేపట్టారని..150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి చెరువులు నింపేందుకు ఎత్తిపోతల పథకాన్ని కూడా చేపట్టారని లేఖలో తెలిపారు. గాలేరు-నగరికి నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం ప్రధాన కుడికాల్వ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకుంటున్నారన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 34 టీఎంసీల నీటిని మాత్రమే తీసుకునే వీలుందని గుర్తు చేశారు.
పాత నాలుగు గేట్ల ద్వారా వరద సమయంలో గరిష్ఠంగా 11,150 క్యూసెక్కుల నీటిని మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం ప్రధాన కుడికాల్వ ద్వారా తరలించవచ్చని పేర్కొన్నారు. జీఎన్ఎస్ఎస్కు నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్‌ను ఆంధ్రప్రదేశ్ కనీసం కోరలేదని లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో గాలేరు నగరి సుజలస్రవంతి ప్రాజెక్టు ఆధునీకరణ, విస్తరణ పనులను ఏపీ చేపట్టకుండా నిలువరించాలని బోర్డును కోరిన తెలంగాణ... కేంద్ర జలవనరులశాఖ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి..
VENKAIAH NAIDU : 'ఆయుష్మాన్ భారత్ చరిత్రాత్మక మార్పునకు నాంది'