TSRTC New Offer: పుస్తక ప్రియులకు టీఎస్‌ఆర్టీసీ చిన్న శుభవార్త చెప్పింది. భాగ్యనగరంలోని ఎన్టీఆర్ మైదానంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో రూ.వంద టిక్కెట్‌పై 20 శాతం రాయితీ ప్రకటించింది. ఈనెల 27 వరకు తగ్గింపు పొందవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.
Telangana RTC New Offer: నగరంలో 24 గంటలపాటు చెల్లుబాటయ్యే రూ.100 ‘టీ24’ టిక్కెట్ కొనుగోలు చేసిన వారికే ఇది వర్తిస్తుందని తెలిపింది. గతంలో మాదిరి కాకుండా, ముందు రోజు ఏ సమయానికి ఈ టిక్కెట్ కొనుగోలు చేస్తే మరుసటి రోజు అదే సమయం వరకు వినియోగించుకోవచ్చని సూచించింది.
Hyderabad Book Fair 2021: సాహితీరంగంలో అత్యంత పేరు ఉన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 18 నుంచి ప్రారంభమైంది. పది రోజులపాటు సాగే ఈ బుక్ ఫెయిర్‌లో దాదాపు 260కిపైగా స్టాల్స్ ఉన్నాయి. చిన్నారులు, మహిళలు సహా అన్ని వర్గాల వారిని ఆకర్షించే పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా పర్యావరణంపై ప్రసంగాలను ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఎప్పటిలాగే హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలోనే బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శనలో పెద్ద ఎత్తున పుస్తక ప్రియులు పాల్గొంటున్నారు. పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ చెప్పిన చిన్ని శుభవార్త పుస్తక ప్రియులకు ఎంతో సంతోషాన్నిచ్చింది.