Telangana corona cases: తెలంగాణలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,11,178 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,557 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,18,196కు చేరాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
corona active cases: తాజాగా తెలంగాణలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,065కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 1,773 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 6,89,878 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు.
తెలంగాణలో ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,474 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రెటు 0.57 శాతం కాగా... రికవరీ రేటు 96.06 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఇవాళ 2,71,165 మందికి కొవిడ్ టీకా డోసులు ఇచ్చారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 5.12 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టయింది.
రేపు మంత్రుల సమీక్ష
కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నియంత్రణా చర్యలు కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో కొవిడ్ నియంత్రణపై రేపు మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రులు సమీక్షించనున్నారు. వైద్య-ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సచివాలయం నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొంటారు. జిల్లాల వారీగా కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై సమీక్షించడంతో పాటు నియంత్రణా చర్యలపై చర్చిస్తారు.