MLA Jaggareddy Latest Comments: తెలంగాణ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల కంటే.. 3 రాష్ట్రాలు చేస్తే మేలని అన్నారు. అలా అయితే జగన్ కుటుంబంలో సీఎం పదవి కోసం ఉన్న గొడవ తీరుతుందని వ్యాఖ్యానించారు. మూడు రాష్ట్రాల్లో ఒకచోట జగన్, ఇంకోచోట షర్మిల, మరోచోట విజయసాయి సీఎం కావొచ్చని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంలో నెలకొన్న సమస్యలపై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శ్రీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.
'ఏపీలో మూడు రాజధానుల కంటే.. మూడు రాష్ట్రాలు చేస్తే మేలు. అప్పుడు ఒకచోట జగన్, మరోచోట షర్మిల, ఇంకోచోట విజయసాయిరెడ్డి సీఎం కావొచ్చు. కుటుంబ పంచాయితీని జగన్, షర్మిల తెలంగాణకు వచ్చి పెట్టడం సరికాదు. అవసరమైతే మోదీతో మాట్లాడి.. సమస్యను పరిష్కరించుకోవాలి. నన్ను కోవర్ట్ అని షర్మిలే కాదు.. మా పార్టీ వాళ్లూ అన్నారు. షర్మిల నా జోలికి రాకుంటే నేను ఆమె జోలికి వెళ్లను. జగన్, షర్మిలలు ఇంకా ఆస్తులు కూడా పంచుకోలేదు.'-జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే
గత ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు వైద్య సేవలు అందేవి.. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పథకం అమలు సరిగ్గా లేదని జగ్గారెడ్డి మండిపడ్డారు. క్యాన్సర్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వైద్యం చేయించుకున్నాక సీఎం సహాయనిధి నుంచి రూ.30 వేలే వస్తున్నాయని అన్నారు.
ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలయ్యేలా కేసీఆర్, హరీశ్‌రావులు చూడాలని జగ్గారెడ్డి కోరారు. సీఎం సహాయనిధి నుంచి మంజూరయ్యే మొత్తం పెంచాలన్నారు. రాష్ట్రంలో సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చినా కలవలేని పరిస్థితి నెలకొందన్న జగ్గారెడ్డి.. ఒకవేళ కలిసినా తప్పు పట్టే పరిస్థితులు వచ్చాయన్నారు.
ఇవీ చదవండి: