Telangana Inter Board Negligence: వార్షిక పరీక్షల నిర్వహణలో తెలంగాణ ఇంటర్‌బోర్డు నిర్లక్ష్యం విద్యార్థులను బెంబేలెత్తిస్తోంది. పరీక్షల ప్రారంభం రోజు ప్రశ్నల పునరావృతం నుంచి రోజుకొక సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హిందీ మాధ్యమం విద్యార్థులకు బుధవారం తొలి ఏడాది పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రాలను చేతితో రాసి ఇవ్వడం గమనార్హం.
Telangana Intermediate Board Negligence : హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని అంబేడ్కర్ కళాశాల, నిజామాబాద్‌లోని మరో కేంద్రంలో ఈ పరీక్ష రాసిన విద్యార్థులున్నారు. ప్రథమ సంవత్సరం 32 మంది, ద్వితీయ ఇంటర్ 24 మంది రాశారు. ఉదయం 8.30 గంటలకు ప్రశ్నపత్రాల బండిల్‌ను తెరిచిన తర్వాత ఆంగ్ల మాధ్యమం పేపర్‌ను అనువాదకుడితో హిందీలో రాయించి.. దాన్ని నకళ్లు తీయించి ఇచ్చారు. చేతిరాత సరిగా అర్థం కాకపోవడంతో సమయం వృథా అవుతోందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సబ్జెక్టు నిపుణులు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బోర్డు అధికారులు అంటున్నారు. ఇలా చేతితో రాసి ఇస్తామని ఆయా ప్రిన్సిపాళ్లకు గత మార్చిలోనే సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. ఆప్షనల్ సబ్జెక్టుల పేపర్లనూ ఇలానే ఇస్తామని తెలిపారు.
ఇంటర్ పరీక్షలు ఈ నెల 6 నుంచి మొదలుకాగా... తొలిరోజు ప్రథమ సంవత్సరం సంస్కృతంలో రెండు ప్రశ్నలు పునరావృతమై విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. మరుసటిరోజు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండో ఏడాది సంస్కృతం బదులు హిందీ పేపర్ ఇచ్చారు. మరొకరికి హిందీకి బదులు సంస్కృతం ప్రశ్నపత్రం ఇచ్చారు.
ఈ నెల 9న సూర్యాపేట జిల్లా కోదాడలో తొలి ఏడాది ఆంగ్లం ప్రశ్నపత్రానికి బదులు రసాయనశాస్త్రం ప్రశ్నపత్రాల కట్ట వచ్చింది. అధికారులు అప్పటికప్పుడు సమీపంలోని పరీక్షా కేంద్రాల నుంచి కొన్ని, జిల్లా కేంద్రం నుంచి మరికొన్ని రప్పించి గంట ఆలస్యంగా ఇచ్చారు. ఇక ప్రశ్నపత్రాల్లో తప్పులు షరా మామూలే.
రోజూ ఇంటర్‌బోర్డు నుంచి.. ఫలానా చోట ఆ పదానికి బదులు ఈ పదం ఉండాలి... ఆ అక్షరం స్థానంలో మరో అక్షరం వచ్చింది... మార్చుకోండంటూ ఎరాటా (తప్పుల సవరణ) పంపిస్తూనే ఉన్నారు. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం ఉర్దూ మాధ్యమం గణితంలో రెండు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, వాటిని సరిదిద్దుకోవాలని బోర్డు పరీక్షా కేంద్రాల అధికారులకు సమాచారం ఇచ్చింది.