Telangana HC on BJP MLAs Suspension : అసెంబ్లీ సమావేశాల నుంచి భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. భాజపా తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. సభ నియమావళికి విరుద్ధంగా సస్పెండ్ చేశారని కాషాయ నేతలు కోర్టుకు వివరించారు. ప్రణాళిక ప్రకారం రాజ్యంగ విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు.
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ ప్రసాద్.. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందించింది. అనంతరం ఈ కేసుపై విచారణ రేపటికి వాయిదా వేసింది.
ఏం జరిగిందంటే..?
ఈనెల 7న శాసన సభలో మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్, రఘునందర్రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించగా.. ఆ ముగ్గురు నేతలు అసెంబ్లీ బయట ఆందోళనకు దిగారు.
సుప్రీం కోర్టు తప్పు పట్టినా..
తమ సస్పెన్షన్‌పై భాజపా ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల, రఘునందన్ రావు.. మరికొందరు కాషాయ నేతలతో కలిసి గరవ్నర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రణాళికా ప్రకారమే తమను సభ నుంచి సస్పెండ్ చేసిందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజల తరఫున తమ గళం వినిపించకుండా చేసేందుకే ఈ కుట్ర అని మండిపడ్డారు. 'మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను సుప్రీం కోర్టు తప్పుపట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు’ అని భాజపా నేతలు గవర్నర్‌కు తెలిపారు.