సినీ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో విడుదలయ్యే సినిమాలకు ఐదో ఆట ప్రదర్శనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సినిమా ప్రదర్శనలకు సమయాన్ని నిర్దేశించింది. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు సినిమాలను ప్రదర్శించుకోవచ్చని చెప్పింది. ఆ సమయంలోనే ఐదో ఆట కూడా ఉంటుందని చెప్పిన ప్రభుత్వం.. ఉదయం 10 గంటల కంటే ముందు అర్ధరాత్రి 1 గంటల తర్వాత ఎలాంటి సినిమా ప్రదర్శనలు ఉండకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
1970, 1988 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం జారీచేసిన ఉత్తర్వులు, నోటిఫికేషన్లను సవరిస్తూ తెలంగాణ సినిమా రూల్స్ 1970లో 43వ అంశాన్ని సవరిస్తూ హోంశాఖ జీవో నంబర్ 10ని జారీ చేసింది. అయితే ఈ జీవోపై తెలంగాణలోని ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాల సమయంలో ఉదయం 7 గంటలకే ప్రదర్శనలు ప్రారంభమవుతాయని, గతంలోనూ అలాగే కొనసాగించామని చెబుతున్నారు. తాజాగా విడుదలైన ఉత్తర్వుల వల్ల ఉదయం 7 గంటల ప్రదర్శనలు ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు సినిమా ప్రదర్శన వేళల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీచూడండి: 'రాధేశ్యామ్'తో ప్రభాస్ మరోసారి లవర్‌బాయ్‌గా మెప్పిస్తారా?