తెలంగాణలో రెండు నగరపాలక సంస్థలు, ఐదు పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో వార్డుల పునర్విభజనకు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకుగాను వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలను వెలువరిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కొత్త పురపాలక చట్టం మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్డుల పునర్విభజన ముసాయిదా, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం అనంతరం వార్డుల తుది జాబితాను పూర్తి వివరాలతో కలెక్టర్లకు అందచేసి ఆమోదం పొందాలని తెలిపారు. తర్వాత పురపాలకశాఖ డైరెక్టర్‌కు వార్డుల వివరాలను అందజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట పురపాలక సంఘం పాలకవర్గాల గడువు మార్చి 14తో ముగుస్తుంది. సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. కొత్త పురపాలికలు కొత్తూరు, నకిరేకల్‌కు తొలిసారి ఎన్నికలు జరుగుతుండగా జడ్చర్ల ఎన్నికలు గతంలో వాయిదా పడ్డాయి.
వార్డుల పునర్విభజనకు ప్రభుత్వ మార్గదర్శకాలు
* నగరం లేదా పట్టణం ఉత్తరం దిక్కునుంచి ప్రారంభించి, తూర్పు, దక్షిణం, పశ్చిమం దిక్కుల మేరకు వార్డుల పునర్విభజన చేయాలి.
* ప్రతి వార్డుకు సహజ సరిహద్దులను నిర్దేశించాలి. అవి లేని చోట సర్వే నంబర్లు, మలుపులు, జంక్షన్లను సరిహద్దులుగా పేర్కొనాలి.
* 2011 జనాభా లెక్కల ప్రకారం లేదా తాజా ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని వార్డుల పునర్విభజన చేయాలి. వివిధ వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో అంతరం పది శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. వార్డుల పునర్విభజన ముసాయిదాను ప్రజలకు అందుబాటులో ఉంచి అభ్యంతరాలను స్వీకరించి నిర్దేశించిన గడువులో వాటిపై నిర్ణయం తీసుకోవాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదేశించారు. వార్డుల పునర్విభజన ప్రతిపాదనలపై ఆ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇవ్వాలన్నారు.
తదుపరి కార్యాచరణ ఇదీ
వార్డుల పునర్విభజన షెడ్యులును పురపాలకశాఖ విడుదల చేయనుంది. వార్డుల పునర్విభజన అనంతరం కొత్తవార్డుల వారీగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించి ఓటర్ల తుదిజాబితాను నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యులును విడుదల చేస్తుంది.
ఇదీ చదవండి: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు పచ్చజెండా!