శ్రీశైలం నుంచి నీటి తరలింపుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రభుత్వంతో పాటు విపక్ష పార్టీలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ వల్ల తెలంగాణలోని పూర్వ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న పార్టీలు పోరు ఉద్ధృతం చేస్తున్నాయి. ఏపీ సర్కారు చర్యల్ని అడ్డుకోవాలని కృష్ణా యాజమాన్య బోర్డును తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు.
అలా చేస్తే తెలంగాణకు అన్యాయం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో కృష్ణాబోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌ను కలిసిన నేతలు... ఏపీ సర్కారు జారీ చేసిన జీవో 203 ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ను కలిసిన రేవంత్‌రెడ్డి బృందం... ఏపీ సర్కారు తీరుపై ఫిర్యాదు చేసింది. ఏపీకి కృష్ణా జలాలు తరలిస్తూ తెలంగాణను ఎడారిగా మారుస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందని రేవంత్ మండిపడ్డారు.
ఏం చేయాలో మాకు తెలుసు
శ్రీశైలం నుంచి నీటిని మళ్లించే చర్యల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఆక్షేపించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశామని గుర్తుచేసిన వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... జగన్ సర్కారు ఇష్టారీతిన వెళ్తే ఏం చేయాలో తమకు తెలుసన్నారు.
నాడు వైఎస్ హయాంలో ప్రాజెక్టుకు హారతులు పట్టిన కాంగ్రెస్ నేతలు.. నేడు ప్రభుత్వంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణకు అన్యాయం జరిగిన ప్రతిసారి ఎదురొడ్డి నిలబడిన చరిత్ర తెరాసదని పేర్కొన్నారు.