తెలంగాణ ఎంసెట్ ఫలితాలు(TS EAMCET RESULTS) నేడు వెల్లడికానున్నాయి. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ఉదయం 11 గంటలకు జేఎన్ టీయూహెచ్ లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్, ఈనెల 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి లక్ష 47 వేల 986 మంది హాజరయ్యారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in తో పాటు ఈనాడు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం ఎత్తేసింది.
ఇంటర్ ఉత్తీర్ణులైన వారందరూ ఇంజినీరింగ్ ప్రవేశాలకు అర్హులని సర్కారు ప్రకటించింది. ఎంసెట్ ర్యాంకులో ఇంటర్, సీబీఎస్ఈ మార్కులకు వెయిటేజీని ఎత్తివేసింది. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ప్రక్రియ ఈనెల 30న ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్ లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సెప్టంబరు 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 15న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. మిగిలిన సీట్లను బట్టి రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటిస్తారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత వ్యవసాయ, ఫార్మా కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: Narayan Rane News: కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బెయిల్ మంజూరు