తెలంగాణ ఎంసెట్ TS EAMCET RESULTS) ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌లో తొలి రెండు ర్యాంకులు సహా టాప్-10లో ఆరు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కార్తికేయకు మొదటి ర్యాంకు సాధించగా, కడప జిల్లా రాజంపేటకు చెందిన దుగ్గినేని నరేశ్ రెండో స్థానంలో నిలిచాడు. అగ్రికల్చర్ విభాగంలో అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తికేయ నాలుగో ర్యాంకు, రాజమండ్రి వాసి విష్ణు వివేక్ ఐదో ర్యాంకు సాధించారు. ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in తో పాటు www.eenadu.net వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
82.08 శాతం ఉత్తీర్ణత
అగ్రికల్చర్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన మండల కార్తికేయ తొలి ర్యాంక్ సాధించాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనిజ రెండో ర్యాంక్, కూకట్‌పల్లికి చెందిన సాయిభూషణ్ రెడ్డి మూడో ర్యాంక్ సాధించినట్లు మంత్రి సబితా వివరించారు. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వెల్లడించారు. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించినట్లు వివరించారు. 9 విడతల్లో నిర్వహించిన ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 82.08 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.
'ఈ సారి ఎంసెట్ పరీక్షకు విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. గతంతో పోల్చుకుంటే 28 వేల మంది విద్యార్థులు అదనంగా హాజరయ్యారు. కరోనా సమయంలోనూ షెడ్యూల్ పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులకు అభినందనలు.' - సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
వెయిటేజీ లేదు
ఈనెల 4, 5, 6న ఇంజినీరింగ్, ఈనెల 9, 10న వ్యవసాయ, ఫార్మాకోర్సుల ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,47,986 మంది హాజరయ్యారు. ఈ ఏడాది 45 శాతం మార్కుల నిబంధన ఎత్తేసిన సర్కారు... ఇంటర్ ఉత్తీర్ణులైన వారంతా ఇంజినీరింగ్ ప్రవేశాలకు అర్హులని ప్రకటించింది. ఎంసెట్ ర్యాంకులో ఇంటర్, సీబీఎస్ఈ మార్కులకు వెయిటేజీ తొలగించారు.
కౌన్సెలింగ్ షెడ్యూలు ఇదే
ఈనెల 30 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ తొలివిడత ప్రక్రియ ప్రారంభంకానుండగా... అదేరోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 15న తొలివిడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను బట్టి రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత వ్యవసాయ, ఫార్మాకోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది.
ఇదీ చదవండి : ACCIDENT: ప్రకాశం జిల్లాలో ప్రమాదం..ఆటో నుంచి పడి నలుగురు మృతి