Telangana DH affected by corona: ఒమిక్రాన్ దెబ్బకు వైద్యసిబ్బంది విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్ బారినపడుతున్నారు. తాజాగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస రావుకు కరోనా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడించిన ఆయన.. ఆస్పత్రిలో చేరుతున్నట్లు తెలిపారు.
సోమవారం వరకు గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ వైద్యవిద్యార్థులు, 38 మంది హౌజ్‌సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు అధ్యాపక సిబ్బంది మహమ్మారి బారిన పడగా ఉస్మానియాలో 71 మంది పీజీ వైద్యవిద్యార్థులతో పాటు 90 మంది సిబ్బంది, నిమ్స్‌లోనూ 70 మందికి పైగా వైద్యులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు.
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 9 మంది వైద్యసిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కొవిడ్ సేవల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందికి 7 రోజుల క్వారంటైన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వైద్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియాలో పాజిటివ్ వచ్చిన వైద్య సిబ్బందికి గతంలో 15 రోజుల సెలవులు ఇవ్వగా.. ప్రస్తుతం వారానికి కుదిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి.నాగేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు.. ఒక్కరోజే 6,996 కేసులు, నలుగురు మృతి