KCR Comments on Modi : రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Yashwanth Sinha Campaign in Hyderabad : హైదరాబాద్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయంలో సిన్హాకు కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం తెరాస శ్రేణులతో భారీ ర్యాలీగా జలవిహార్‌కు తరలివెళ్లారు. అక్కడ కేసీఆర్ అధ్యక్షతన యశ్వంత్ సిన్హాకు మద్దతుగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిన్హా, సీఎం కేసీఆర్‌తో పాటు తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు.
KCR supports yashwanth sinha : తెలంగాణ ప్రజల పక్షాన యశ్వంత్‌సిన్హాకు సీఎం కేసీఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. సిన్హా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారని కొనియాడారు. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించి.. వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారని తెలిపారు. భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హాది కీలకపాత్ర అని కేసీఆర్ అన్నారు. ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉందని వెల్లడించారు.
"ప్రధాని ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉంటారు. ప్రతిపక్షాలపై ప్రధాని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మేం వేసిన ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా సమాధానం చెప్పాలి. మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. టార్చిలైట్ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. డీజిల్ సహా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారు. ఇవి చాలదన్నట్లు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారు." -- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలిపారు. ప్రధానిగా కాకుండా... దేశానికి సేల్స్‌మెన్‌గా మోదీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని చెప్పారు. మోదీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ దిగజారుతోందని కేసీఆర్ విమర్శించారు. శ్రీలంక చేసిన ఆరోపణలపై స్పందించకుండా మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబద్ధమని కేసీఆర్ అన్నారు. మోదీ పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిందని... జీడీపీ పడిపోయిందని తెలిపారు. మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే మాత్రం ప్రధానిని దోషిగానే చూడాల్సి వస్తుందని చెప్పారు. ప్రధాని ఈ విషయంపై స్పందించే వరకు తాము మౌనంగా ఉండమని.. పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
"వ్యవసాయ చట్టాలపై రైతులు సుదీర్ఘంగా పోరాటం చేశారు. ఉద్యమంలో కొందరు రైతులు మృతిచెందారు. ఉద్యమంలో మృతిచెందిన రైతులకు రూ.3 లక్షలు అందజేశాం. రైతు కుటుంబాలకు సాయం చేస్తే భాజపా చులకనగా చూసింది. ఉద్యమిస్తున్న రైతులపై జీపులతో తొక్కించారు. రైతు ఉద్యమకారులను ఉగ్రవాదులు అన్నారు. మోదీ పాలనలో దేశ ప్రతిష్ఠను మసకబారేలా చేశారు. మోదీ శాశ్వతంగా పదవిలో ఉంటానని అనుకుంటున్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. మార్పు వచ్చి తీరుతుంది." -- కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
వికాసం పేరుతో మోదీ దేశాన్ని నాశనం చేశారని కేసీఆర్ ఆరోపించారు. ఆయన పాలనలో అంతా తిరోగమనమేనని అన్నారు. మోదీ... ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లధనం నియంత్రణ కాదు... రెట్టింపైందని తెలిపారు. వికాసం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. అవినీతి రహిత భారత్ అని పెద్దపెద్ద మాటలు చెప్పారు కానీ మోదీ పాలనలో అవినీతిపరులు పెరిగారని చెప్పారు. భాజపా పాలనలో అన్నీ స్కామ్‌లే జరిగాయని విమర్శించారు. దోస్తులకే తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మోదీకి లేదని ఆరోపించారు. భాజపా పాలనలోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎందుకు పడిపోయిందో చెప్పాలని కోరారు.