తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. ఉద్యోగాల భర్తీ(jobs notification) అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు ఆమోదముద్ర నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలిగిపోయాయని, తక్షణమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. యాభై వేల నియామకాలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేబినెట్‌కు నివేదించాలని స్పష్టం చేశారు.
అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ రెండు రోజుల పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశమై కసరత్తు పూర్తి చేసింది. వాటన్నింటినీ క్రోడీకరించి ఖాళీలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేశారు. అన్ని శాఖల్లో కలిపి 55వేలకు పైగా ఖాళీలున్నట్లు సమాచారం. వీటితో పాటు పదోన్నతుల ద్వారా వచ్చే ఖాళీలు, కారుణ్య నియామకాలు తదితరాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఉండేలా నోటిఫికేషన్లు జారీ చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రిజిస్ట్రేషన్ రుసుముల పెంపుపై చర్చ..
రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువ, రిజిస్ట్రేషన్ రుసుముల పెంపుపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఏడేళ్లుగా ధరలు సవరించని నేపథ్యంలో భూములు, ఆస్తుల విలువ పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల సిఫారసు చేసింది. అందుకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేసింది. వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువ కనిష్ఠంగా 20శాతం, గరిష్ఠంగా 50 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించారు.
వ్యవసాయ భూములు కనిష్ఠంగా వందశాతం, గరిష్ఠంగా 400శాతం పెంచాలని ప్రతిపాదనలు రూపొందించారు. రిజిస్ట్రేషన్ రుసుము రాష్ట్రంలో ప్రస్తుతం ఆరుశాతం ఉంది. పొరుగు రాష్ట్రాల్లో ఏడు, ఏడున్నర శాతం ఉన్న నేపథ్యంలో దాన్ని సైతం పెంచాలని ప్రతిపాదించారు. వీటన్నింటిని పరిశీలించి భూములు, ఆస్తులు విలువ, రిజిస్ట్రేషన్ రుసుము పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పేద, మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొనే విలువల పెంపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కరోనా పరిస్థితులు, నియంత్రణా చర్యలు..
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణా చర్యలు, తదుపరి కార్యాచరణపై కేబినెట్ లో చర్చించనున్నారు . ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో అధికారుల బృందం కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించింది. కారణాలు, పరిస్థితులపై అధికారుల బృందం కేబినెట్‌కు నివేదిక సమర్పించనుంది . పల్లె, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలపైనా సమావేశంలో ప్రస్తావన రానుంది. కార్యక్రమాలు జరిగిన తీరు, ఫలితాలు, భవిష్యత్‌లో అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
చర్చకు రానున్న జలవివాదం..
ఆంధ్రప్రదేశ్‌తో కృష్ణా జలాల వివాదం సమావేశంలో చర్చకు రానుంది. రాయలసీమ ఎత్తిపోతల పనులు(rayalaseema lift irrigation), రాష్ట్ర ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు, సంబంధిత అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేయనున్నారు.
ఇతర అంశాలు..
వానాకాలం(monsoon crop) పంటల సాగుస్థితిపై కేబినెట్‌లో మథనం జరగనుంది. ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(parliament monsoon session) ప్రారంభం కానున్న తరుణంలో సంబంధిత అంశాలూ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ(ration cards), ఇతర పాలనా, రాజకీయపరమైన అంశాలు సైతం మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: