Telangana Assembly Sessions 2022 : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డిలకు శాసనసభ సంతాపం తెలిపింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించారు. అంతకుముందు స్పీకర్ మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డి సేవలను కొనియాడారు. ఆ తర్వాత సభను 12వ తేదీకి వాయిదా వేశారు.
అనంతరం సమావేశాల అజెండా ఖరారుపై బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 12, 13 తేదీల్లో శాసనసభ సమావేశాలు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కోరగా.. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల దృష్ట్యా తర్వాత చూద్దామని ప్రభుత్వం తెలిపింది. పని దినాలు బాగా తగ్గుతున్నాయని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొనగా.. పని దినాలు తగ్గినా ఎక్కువ సమయం నడుపుతున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొన్ని బిల్లులు, తీర్మానాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చిద్దామని అధికార పక్షం తెలపగా.. రైతులు, నిరుద్యోగం, ధరలు, వరదలపై చర్చించాలని కాంగ్రెస్ కోరింది. మైనార్టీల సమస్యలు, హైదరాబాద్ అంశాలపై చర్చించాలని మజ్లిస్ పార్టీ కోరింది.
Telangana Assembly Sessions adjourned : మరోవైపు ఇటీవల గోదావరి వరదల వల్ల జరిగిన నష్టంపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. రాష్ట్రంలో అతివృష్టి, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిపై సభ్యులు చర్చించారు. ఈ చర్చ సందర్భంగా తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని.. భద్రాచలం రక్షణకు రూ.వెయ్యికోట్లు కేటాయించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వరదసాయం ఒక్క పైసా కూడా రాలేదని ఆయన ఆరోపించారు.
అస్త్రాలతో విపక్షాలు..: సమావేశాల్లో పలు అంశాలను ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. వరదలు, రైతుల, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టులు, ధరణి ఇబ్బంది, ఉద్యోగ నియామకాలు వంటి అంశాలపై ప్రశ్నించాలని విపక్షాలు భావిస్తున్నాయి. సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, వివక్షను ఎండగట్టాలని అధికార పక్షం భావిస్తోంది. కొన్ని బిల్లులను సర్కార్ ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది. జీహెచ్ఎంసీ, పురపాలక, పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణలు సహా ఇతర బిల్లులు ఉన్నాయి.