శ్రీశైలంపై కొత్త ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశారు. కృష్ణా నుంచి రోజూ.. 10 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును తలపెట్టిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటి సమస్య ఏర్పడుతుందని కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కృష్ణా నదీ యాజమానన్య బోర్డులో ఫిర్యాదు చేస్తామన్నారు.
రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. - తెలంగాణ సీఎం కేసీఆర్