ఉపాధ్యాయ బదిలీలను పాఠశాల, సర్వీసు పాయింట్ల ఆధారంగా నిర్వహించనున్నారు. సర్వీసును గుర్తించేందుకు జులై 31గాని, అకడమిక్ సంవత్సరాన్నిగాని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలపై కమిషనర్ చినవీరభద్రుడు బుధవారం ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
- కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీ దరఖాస్తుకు అర్హులు. ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరి బదిలీ.
- హేతుబద్ధీకరణకు గురయ్యే ఉపాధ్యాయులకు రెండు, స్పౌజ్‌కు రెండు పాయింట్లు ఇస్తారు.
- కేటగిరి-4లోని పాఠశాలకు ఐదు, కేటగిరి-1,2,3లకు 1,2,3 పాయింట్లు కేటాయిస్తారు.
- సర్వీసుకు సంబంధించి ఏడాదికి 0.2 పాయింట్లు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా ఒక పాయింట్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
- ప్రాథమిక పాఠశాలల్లో 40-60 విద్యార్థులు ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులను నియమిస్తారు.
- ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లం, తెలుగు రెండు మాధ్యమాలను పరిగణనలోకి తీసుకొని పోస్టుల కేటాయింపు.
- జిల్లా విద్యాధికారి ఫూల్‌లో ఉన్న భాషపండితులను ప్రాథమికోన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు.
- పదోతరగతి విద్యార్థులకు ఎలాంటి గ్రేడ్లు ఇవ్వకుండా ఉత్తీర్ణులుగా పరిగణించాలని సంఘాల ప్రతినిధులు కోరారు.
ఈనెల 7 తర్వాత వారానికోసారి...
ఉపాధ్యాయులు ఈనెల 7వ తేదీ వరకు బడులకు వెళ్లి విద్యార్థుల వివరాల నమోదు పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. తర్వాత నుంచి వారానికి ఒకరోజు పాఠశాలలకు వెళ్లాలని పేర్కొన్నారు. మంగళవారం ప్రాథమిక, బుధవారం ప్రాథమికోన్నత, శుక్రవారం ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు బడులకు వెళ్లాలి. విద్యార్థులకు ఉపయోగపడే అకడమిక్ కార్యక్రమాలను రూపొందించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ఆన్లైన్ బోధన.. ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు విద్యాసంవత్సరం