వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్.. కార్యకర్తలతో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జగన్ సహా మంత్రులపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేశ్ నిరసనకు యత్నించడం, వారిని బుద్దా వెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడం.. యుద్ధ వాతావారణం నెలకొంది. ఇరు పార్టీల నాయకులు పరస్పర నినాదాలు, దూషణలతో.. సంఘటనా స్థలం రణరంగాన్ని తలపించింది.
ఏం జరిగింది..
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. కార్యకర్తలతో కలిసి జోగి రమేశ్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. వారిని బుద్దా వెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న జెండా కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలూ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు కష్టపడ్డారు. లాఠీ కూడా ఝళిపించారు.
జోగి రమేష్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ఇంటి దగ్గర నిరసన ఎందుకు చేపడుతున్నారంటూ బుద్ధా నిలదీశారు. అదే సమయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాటలు చేటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బుద్ధా వెంకన్న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి కిందపడిపోయారు.
తెదేపా నాయకుల ప్రతిఘటనతో చేసేది లేక జోగి రమేశ్.. కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి. ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు రాళ్ల దాడిలో ధ్వంసం అయ్యింది.
గొడవ మరింత పెరిగేలా ఉందని భావించిన పోలీసులు.. ఇరువర్గాల వారినీ చెదరగొట్టారు. అనంతరం పోలీసులు జోగి రమేశ్ ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
జగన్ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ: తెదేపా
డీజీపీ దగ్గరుండి వైకాపా నేతలను చంద్రబాబు ఇంటికి పంపారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. వైకాపా నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తెదేపా నేతలపైనే పోలీసులు ప్రతాపం చూపుతున్నారని గద్దె రామ్మోహన్ ఆరోపించారు. పోలీసులే వైకాపా నేతలను ప్రోత్సహిస్తున్నారని.. పోలీసులే బుద్దా వెంకన్నను కిందపడేసి కొట్టారని ఆరోపించారు. వైకాపా నేతలు సమాచారం లేకుండా ఆందోళనకు వచ్చారని బుద్దా వెంకన్న అన్నారు. అధికార పార్టీ నేతలు తమపై దౌర్జన్యం చేశారని.. దాడి చేసి కొట్టారని చెప్పారు. జగన్ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ అని ఆక్షేపించారు.
'జోగి రమేష్ నిన్ననే సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని పోస్టు పెట్టారు. మేం చిన్న పోస్టు పెడితే గృహనిర్బంధాలు చేస్తారు. జోగి రమేష్ పోస్టుపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు.'- తెదేపా నేత నాగుల్‌మీరా
బీసీల ప్రతినిధిగా అయ్యన్న ప్రశ్నలు అడిగారని.. ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పలేకే చంద్రబాబు ఇంటిపై దాడి చేశారని అయ్యన్నపాత్రుడు కుమారుడు.. విజయ్‌పాత్రుడు అన్నారు. చెత్తపై పన్నును ప్రశ్నించడమే అయ్యన్న చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఓటమి భయం మొదలైనందుకే దాడులను జగన్ ప్రోత్సహిస్తున్నారు విజయ్ విమర్శించారు.
కావాలనే చంద్రబాబు ఆరోపణలు చేయించారు: జోగి రమేశ్
చంద్రబాబు కావాలనే జగన్‌పై ఆరోపణలు చేయించారని జోగి రమేశ్ అన్నారు. చంద్రబాబే తనపై రాళ్లు వేయించారని.. తెదేపా కార్యకర్తలు తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు.
రాళ్లు, కర్రలతో దాడి దారుణం...
తెదేపా నేతలపై రాళ్లు, కర్రలతో దాడి దారుణమని రాష్ట్ర పౌరహక్కుల సంఘం పేర్కొంది. దౌర్జన్యకారులకు పోలీసులే మద్దతివ్వడం దురదృష్టకరమని వెల్లడించింది. వైకాపా శ్రేణులు మీడియాపై చేసిన దాడిని ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: Tirumala Srivari Brahmotsavalu: అక్టోబర్ 7 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు