తెలుగు వారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అరాచకాల చీకట్ల నుంచి ఆనందపు వెలుగుల వైపు నడిపించే వెలుగు దివ్వెల పండుగ దీపావళి అని చంద్రబాబు అభివర్ణించారు. సమాజంలో హింస, విధ్వంసాలకు చరమగీతం పాడిన రోజు అని తెలిపారు. బలహీనులపై దాడులు, దౌర్జన్యాలు అంతమైన శుభదినమని, రాక్షసత్వంపై మానవత్వం విజయం సాధించిన పర్వదినమని చెప్పారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ నరక చతుర్దశి, దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా నిబంధనలను పాటిస్తూ కుటుంబసభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ఈ దీపావళి అందరికీ సకల శుభములు చేకూర్చాలని ఆకాంక్షించారు. కొవిడ్ వైరస్ సెకండ్ వేవ్ పొంచి ఉన్నందున ప్రతీ లోగిళ్లలో హరిత దీపావళి జరుపుకోవాలని నారా లోకేశ్ కోరారు. దీపావళి పండగ అందరి జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వాలు సూచించిన నిబంధనలు పాటిస్తూ, పర్యావరణ హిత దీపావళి సామాగ్రిని వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి