ప్రజల బాధ, వేదన తనకేమీ పట్టదన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ మహానటుడిలా వ్యవహరిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి దుయ్యబట్టారు. ''పరిపాలన చేతగాని వారికి రాష్ట్రాన్ని అప్పగించామని ప్రజలంతా బాధపడుతున్నారు. ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ అంటూ వాహనాల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు తగలేసిందని ప్రజలే అనుకుంటున్నారు. ప్రజల సొమ్ము దుబారా చేస్తూ వారికేం సమాధానం చెబుతారు. ప్రశాంత్ కిషోర్ వెర్రి ఆలోచనల ప్రకారమే సీఎం పనిచేస్తున్నాడని ప్రజలకు అర్థమైంది. పాలనతో విసిగిపోయిన వారంతా జమిలి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక దాదాపు 378 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. గన్ కంటే ముందు జగన్ వస్తాడని ప్రగల్భాలు పలికిన వారు ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఏం సమాధానం చెబుతారు." అని నిలదీశారు.
అన్యాయంపై మాట్లాడండి: జవహర్
భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఏపీకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా అనవసర వ్యాఖ్యలెందుకని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. "నేల విడిచి సాము చేసే మాటలు మాని రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలి. ఐక్యరాజ్య సమితి గురించి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పడిన నామినేషన్ల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు. విభజన హమీల గురించి, పోలవరం నిర్వాసితుల గురించి పోరాడాలి. నీ వాక్బాణం గురి లేనిది. విలువ లేని పైసలుగా మిగలకండి." అని ఓ ప్రకటనలో హితవు పలికారు.
ఇదీ చదవండి: