TDP PROTEST: విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నేతలు నిరసనలు చేపట్టారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ధరల పెంపుపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై భారం మోపడానికి ప్రభుత్వం సమాయత్తమైందన్నారు. రాబోయే నెల రోజుల్లో విద్యుత్ ధరల ప్రభావం తెలుస్తుందన్నారు. గతంలో ఛార్జీలు పెరగకున్నా బాదుడే బాదుడు అని ప్రచారం చేశారని.. అప్పుడు చేసిన ప్రచారాన్ని ఇప్పుడు నిజం చేస్తున్నారని మండిపడ్డారు. మొదట ట్రూఅప్ ఛార్జీలు వేశారని.. గట్టిగా నిలదీస్తే వెనక్కి తగ్గారని చెప్పారు. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలు భారం మోయాల్సి వస్తోందని.. భవిష్యత్తులో మరో రూ.30 వేల కోట్ల భారం ప్రజలపై పడనుందని పయ్యావుల అన్నారు.
TDP PROTEST: పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరాటం చేస్తామని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. అన్ని పార్టీలూ ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. చెత్తపైనా పన్ను వేసిన ఘనత జగన్‌దే అని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి ధాన్యం కొని డబ్బులు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని చినరాజప్ప సూచించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపారని వంగలపూడి అనిత మండిపడ్డారు. ఎండాకాలం ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో త్వరలో కొత్త పథకాలు వస్తాయని.. చేతికో కర్ర, ఇంటికో లాంతరు ఇచ్చే పథకం మొదలుపెడతారని వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ తప్పుడు నిర్ణయాల వల్లే.. ప్రజలపై విద్యుత్ భారం: లోకేశ్