ANNA CANTEEN: ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి దశదిన కర్మ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచన మేరకు తెదేపా శ్రేణులు రాష్ట్రంలోని 14 అన్న క్యాంటీన్లలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించాయి. ఉమామహేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సుమారు పది వేల మంది ఈ అన్నదానంలో పాల్గొన్నారు.
NTR YOUNGER DAUGHTER DIED: ఇటీవల దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆగస్టు 1న హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమామహేశ్వరి మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
ఆమె మరణ వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఆమె ఇంటికి వెళ్లారు. అంతకుముందే నందమూరి కల్యాణ్ రామ్ అక్కడికి చేరుకున్నారు. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. చిన్న కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది. పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావడంతో.. బుధవారం అంత్యక్రియలు జరిగాయి.
ఉమామహేశ్వరి నేత్ర దానం..: ఉమామహేశ్వరి భౌతికకాయానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తైన అనంతరం.. ఆస్పత్రి నుంచి ఆమె మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు. కంఠమనేని ఉమామహేశ్వరి కోరిక మేరకు ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.
ఉమామహేశ్వరి భౌతికకాయానికి ఎంబామింగ్..: అనారోగ్య కారణాల నేపథ్యంలో ప్రాణాలు విడిచిన ఉమామహేశ్వరి భౌతికకాయానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఎంబామింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఆమె పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో అంత్యక్రియలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె భౌతికకాయానికి ఎంబామింగ్ ప్రక్రియ చేశారు.
ఇవీ చదవండి: