గుంటూరు జిల్లాలో...
హిందూ దేవాలయాలను పరిరక్షించాలని కోరుతూ మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
దేవాలయాలపై దాడులను నిరసిస్తూ కొత్తపేట నియోజకవర్గంలో తెదేపా నాయకులు పూజలు నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలు, రథాలపై జరుగుతున్న దాడులను నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అనంతపురం జిల్లాలో...
వైకాపా ప్రభుత్వ వైఖరి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని... తెలుగు మహిళా నాయకురాలు స్వప్న ఆరోపించారు. అంతర్వేది ఘటనను ఖండిస్తూ అనంతపురంలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో మహిళలకు పసుపు, కుంకుమ ఇచ్చి నిరసన తెలిపారు.
కర్నూలు జిల్లాలో...
వైకాపా ప్రభుత్వం హయాంలో దేవాలయాలకు భద్రత లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. అంతర్వేది ఘటనను నిరసిస్తూ... తెదేపా ఆధ్వర్యంలో వారంరోజుల పాటు దేవాలయల వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విశాఖ సముద్రంలో టోర్నడో... ఆసక్తిగా తిలకించిన స్థానికులు