ఎన్నో గుడులు, విద్యాలయాలు నిర్మించిన అశోకగజపతిరాజును మంత్రులు నీచమైన భాషలో దూషించడం సహించరాని విషయమని మాజీమంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలతో హిందువులే కాదు.. ప్రజలందరీ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా ఆలయాలు కూలుతుంటే బాధ్యత వహించి పదవి నుంచి వైదొలగాల్సిన మంత్రి.. వాటిని కట్టిన నిష్కలంకుడైన అశోక్ గజపతిరాజును ధర్మకర్త బాధ్యతల నుంచి తొలగించి నోటికొచ్చినట్టు దూషిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ప్రధాని మెచ్చిన వ్యక్తి..అశోక్: బండారు
అగ్గికైనా చెద పడుతుందేమో గానీ, అశోక్ గజపతిరాజు, పూసపాటి వంశీయులు అవినీతి చేశారంటే ఎవరూ నమ్మరని మాజీమంత్రి బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో అశోక్ గజపతిరాజు ప్రభుత్వ సొమ్ముతో కప్పు టీ కూడా తాగలేదన్నారు. ప్రధాని మోదీ కూడా అశోక్ గజపతి రాజు పనితనాన్ని మెచ్చుకున్నారని, అటువంటి వ్యక్తి గురించి వెల్లంపల్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అశోక్ గజపతి రాజుని ఉద్దేశించి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలను ఆయన తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సాయిరెడ్డికి అక్కడ ఏం పని?: రామకృష్ణా రెడ్డి
మతసామరస్యాన్ని కాపాడటంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు రామతీర్ధం పర్యటించడానికి వెళ్తే... వైకాపా నేత విజయసాయిరెడ్డికి అక్కడ ఏమి పని ఉందని వెళ్లారని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లి ప్రజలను భక్తులు మనోభావాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సమర్ధనీయం కాదన్నారు. ధర్మకర్త పదవి నుంచి అశోక్ గజపతిరాజుని తొలగించడం దారుణమన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ... దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, హోం మంత్రి మేకతోటి సుచరిత రాజీనామా చేయాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: