Atchannaidu on CM Jagan Comments: జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి 5 కోట్ల మంది ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. బాధిత కుటుంబాలే నాటుసారా తాగి చనిపోయారని చెప్తుంటే సహజ మరణాలని అపహాస్య చేస్తారా ? అని నిలదీశారు. అవాస్తవాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నందుకే మమ్మల్ని సస్పెండ్ చేసి బలవంతంగా బయటికి పంపించారని మండిపడ్డారు.
మరణాలపై అసెంబ్లీ సాక్షిగా హేళన: బొండ ఉమా
TDP leader Bonda Uma: రాష్ట్రంలో గత మూడేళ్లుగా వైకాపా నాయకులు అక్రమమద్యం, నాటుసారా, గంజాయి వంటి వ్యాపారాలు చేస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామామహేశ్వరరావు ఆరోపించారు. జంగారెడ్డిగూడెం ఘటనలోని మరణాలను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ హేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వాస్తవాలు చంద్రబాబు వెలికితీశాక నాటు సారా విక్రయదారులపై పది కేసులు నమోదు చేశారు. సహజ మరణాలని చెప్పిన వైకాపా నేతలు.. నేడు కేసులెలా పెట్టారని బొండా ప్రశ్నించారు.
పవన్ సభకు తెదేపా మద్దతు అని ఆరోపణలు చేసిన వైకాపాకు మా పొత్తులపై ఎందుకంత ఉలికిపాటు అని ప్రశ్నించారు. తెదేపాకు జనసేనతో పొత్తేమి కొత్తకాదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రసక్తి రాకూడదనే తమ ఉద్దేశ్యమని పవన్ కళ్యాణ్ స్పష్ట చేశారని.. రాబోయే రోజుల్లో పొత్తులపై రెండు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటాయన్నారు.
మృతుల కుటుంబాలకు అండగా తెదేపా: కొల్లు రవీంద్ర
కల్తీసారా మరణాల పట్ల సీఎం జగన్ వ్యాఖ్యలు బాధాకరమని తెదేపా నేత కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఊరుపేరు లేని మద్యం బ్రాండ్లు, కల్తీ సారా.. ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే ప్రతి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం చేశామని.. అధికారంలోకి వచ్చాక మరింత సాయం అందిస్తామన్నారు. ఈమేరకు మచీలిపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను అన్ని రాజకీయ పక్షాలు స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్ దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకు అన్ని పక్షాలు ఏకం కావల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పవన్‌పై పేర్ని నాని వ్యాఖ్యలను ఖండించిన కొల్లు రవీంద్ర.. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గు లేదా..? అని ప్రశ్నించారు.
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తయారీదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తే.. సీఎం మాత్రం అక్కడ ఎలాంటి తయారీ లేదని ఎలా చెప్తారని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. పోస్టుమార్టం నివేదికలు రాకుండానే అంతా సహజ మరణాలేనంటూ సీఎం అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
టీడీఆర్ బాండ్ల ద్వారా రూ. 390కోట్లు స్వాహా: పట్టాభి
TDP leader Pattabhi on TDR Bands: తణుకు మున్సిపాలిటీ కేంద్రంగా టీడీఆర్ బాండ్ల ద్వారా రూ. 390కోట్లు కాజేసిన అవినీతి కాలనాగు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు... మతిభ్రమించి మాట్లాడుతున్నారని తెదేపా జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. సమాచార హక్కుచట్టం ద్వారా సేకరించిన వాస్తవాలను ప్రజలముందు ఉంచితే సమాధానం చెప్పలేక కారుమూరి నాలుక మడతపెట్టేశాడని స్పష్టంచేశారు.
టీడీఆర్ బాండ్లపై జరగకూడనిది ఏదో జరిగిందని.. మంత్రికి చెప్పానంటూ కొత్తరాగం ఆలపించాడని పట్టాభి ఆక్షేపించారు. నిజంగా దమ్ము, ధైర్యముంటే టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై ముఖ్యమంత్రితో చర్చించి సీబీఐ విచారణకు ఆదేశించాలని పట్టాభి డిమాండ్ చేశారు.
గనులు కట్టబెట్టేందుకు కుట్ర: చెంగల్రాయుడు
రాష్ట్రంలో గనులన్నింటినీ వైకాపా నాయకులకు కట్టబెట్టేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంగల్రాయుడు ఆరోపించారు. ఈ-ఆక్షన్ విధానంలో గనులను కేటాయించేలా జీవో 14 తీసుకొచ్చారని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి మైనింగ్ చేస్తున్న చిన్న మైనింగ్ దారులు, గనులను లాక్కునేందుకే ఈ ఆక్షన్ విధానమని విమర్శించారు.
చారిత్రక ప్రసిద్ధిగాంచిన గజ్జలకొండలో ఎమ్మెల్యే కాటసాని నేతృత్వంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి మైనింగ్‌కు అనుమతిచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే అక్రమ మైనింగ్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు 'గొడ్డలి' డేను పరిచయం చేసిన జగన్: సత్యానారాయణమూర్తి
మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డేలను చూసిన రాష్ట్ర ప్రజలకు.. జగన్ రెడ్డి కొత్తగా గొడ్డలి డేను పరిచయం చేశాడని మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. తన బాబాయ్‌ను చంపించినా కూడా ముఖ్యమంత్రికి పగతీరలేదని ఆయన మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్లు అయినా.. ఏనాడూ అసలుదోషులను పట్టుకోవడానికి జగన్ తన అధికారాన్ని ఉపయోగించలేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:
RRR: పవన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి: ఎంపీ రఘురామ