Lokesh Comments on Budget: వైకాపా కోటరీ బాగుపడాలన్న రీతిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి కాదు... జగన్ మోసపు రెడ్డి అని ప్రజలు నిర్ధారణకు వచ్చారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం ఆయా వర్గాలను మోసాగించటమేనని అన్నారు. బీసీల ఊసే లేకుండా బడ్జెట్ పెట్టారుని దుయ్యబట్టారు.
అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజమని ఎద్దేవా చేశారు. వాహన మిత్ర అబద్దం, డ్రైవర్లను మోసం చేశారన్నది నిజమని ఆగ్రహంవ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రభుత్వం కోతలు పెడుతూ పోతోందని తెలిపారు. హాజరు శాతం పేరుతో అమ్మఒడిలో భారీ కోత పెట్టారని పేర్కొన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి రూ. 1850 పింఛన్ ఇస్తే, తండ్రి కొడుకులు కలిసి ఇచ్చింది కేవలం రూ. 625 మాత్రమేనని తెలిపారు. మద్యపాన నిషేధం, విద్యారంగం, సంక్షేమం, రైతులు, చేనేత ఇలా అన్ని వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం వాస్తవాలు గ్రహించి తెలుగుదేశం హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఇదో మాయల మరాఠీ బడ్జెట్..
Atchannaidu Comments on Budget:ఇదో మాయల మరాఠీ బడ్జెట్ అని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అందుకు తగ్గ రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని మండిపడ్డారు. న్యాయస్థానం తీర్పును సైతం ఈ ప్రభుత్వం విస్మరించి కోర్టు ధిక్కారణకు పాల్పడిందని ఆరోపించారు. బడ్జెట్లో అమరావతి పేరు ప్రస్తావన కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలెవరికీ రుణాలివ్వలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు.
వైకాపా ప్రభుత్వం చీకటి బడ్జెట్ ప్రవేశపెట్టింది..
Gorantla Comments on Budget: వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టింది చీకటి బడ్జెట్ అని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. అకౌంటబిలిటీ లేకుండా చేసుకునే గోబెల్స్ ప్రచారం ఆర్ధిక ఉగ్రవాదమేనని దుయ్యబట్టారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని కూడా సంక్షేమానికి ఖర్చు చేయకపోవడంతో రాష్ట్రం చిన్నాభిన్నమవుతోందన్నారు. గత బడ్జెట్లో దోచిందెంత, దాచిందెంతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని తెలిపారు. లక్షల కోట్లు అప్పు తెచ్చి, సంక్షేమాన్ని విస్మరిస్తూ తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగితాల ప్రకటనలకే బడ్జెట్ పరిమితమవుతోంది తప్ప ఎక్కడా రాజ్యాంగ బద్ధంగా లేదని మండిపడ్డారు.
ఇదీ చదవండి: AP-BUDGET: రూ.2.56 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్