కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసిందని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ముందస్తు నియామకాల్లో, యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరోనా కేసుల విస్తరణలో అమెరికా, బ్రెజిల్ స్థాయికి ఏపీ చేరడం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ చెప్పినట్లు కరోనాతో సహజీవనం ఇదేనా అని యనమల నిలదీశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోడానికి కూడా జగన్ సిద్ధంగా లేరని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం పబ్జీ గేమ్ కాదన్న యనమల..., రోజుకు 90 మంది ప్రాణాలు పోతుంటే, నిద్ర ఎలా పడుతోందని ప్రశ్నించారు.
"కేంద్రం ఇచ్చిన రూ.8 వేల కోట్లు ఏంచేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఆహారానికి ఎంత ఖర్చు చేశారు. డిశ్చార్జ్ నగదు 2 వేలు ఎంతమందికి ఇచ్చారు. మాస్క్ ల కొనుగోళ్లకు ఎంత ఖర్చుచేశారు, ఆర్టీపిసిఆర్, ట్రూనాట్ పరీక్షలు ఎన్ని చేశారు. పరీక్షలపై మొత్తం ఎంత ఖర్చు చేశారో ప్రజల ముందు ఉంచండి. కరోనా కిట్ల కొనుగోళ్లకు, మీ ఔషధం బ్లీచింగ్ కొనుగోళ్లపై ఖర్చెంత. కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయండి. "----యనమల రామకృష్ణుడు, తెదేపా నేత
ఇదీ చదవండి : మహిళలకు జగన్ క్షమాపణలు చెప్పాలి: నిమ్మల రామానాయుడు