Yanamala Ramakrishnudu comments : అసెంబ్లీకి అబద్ధాలు చెప్పిన జగన్ రెడ్డికి ప్రివిలేజ్ నోటీసులివ్వాలని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఏకపక్షంగా సభ నిర్వహించడం.. ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షులుండరని.. చట్టసభల ప్రతిష్ఠకు, గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ట్రెజరీ నియమావళి పాటించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతోనే రూ.26,839 కోట్లు చెల్లించారని.. రూ.9,124 కోట్లకు సంబంధించి ఆర్థిక శాఖ వద్ద వివరణే లేదన్నారు.
కనీసం జీవోలు కూడా విడుదల చేయకుండా రహస్యంగా రూ.8,891 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఏ శక్తి పని చేస్తుందని నిలదీశారు. గత ఐదేళ్ల కంటే 2020-21లో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైనట్లు కాగ్ స్పష్టం చేసిందన్నారు. రెవెన్యూ లోటు రూ.35,541 కోట్లతో ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని.. ఇది గత ఏడాదితో పోల్చితే 34.42 శాతం పెరిగిందన్నారు. ద్రవ్యలోటు 39.01 శాతం నుంచి 59.53 శాతానికి చేరుకుందని.. రూ.6,278 కోట్లు రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారన్నారు.
సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పుకునే జగన్ రెడ్డికి.. స్థానిక సంస్థల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పంచాయతీలకు సంబంధించిన రూ.854 కోట్ల నిధులు కొల్లగొట్టారని విమర్శించారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం తన వాటా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది గర్భిణులు ప్రధానమంత్రి మాతృవికాస యోజన కింద ఇచ్చే రూ.5 వేలు కోల్పోయారన్నారన్న యనమల.. ఇదేనా మీరు సాధించిన అభివృద్ధి అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: