వైకాపా ప్రభుత్వం చేసేది తక్కువ... ఆర్భాటం మాత్రం ఎక్కువని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, సంపూర్ణ పోషణ ప్లస్ పథకం, రెండు కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసినవేనని ఆమె తెలిపారు. గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడానికి అన్న అమృతహస్తం, బాలామృతం, పథకాలను తెదేపా ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు.
రంగులు, పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడం తప్ప, వైకాపా ప్రభుత్వం కొత్తగా చేస్తున్నదేమీ లేదని అనిత దుయ్యబట్టారు. సాక్షి పత్రికలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కోట్లకు కోట్ల ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వం.. పేదలకు మాత్రం 5 రూపాయలతో భోజనం పెట్టలేకపోతోందని మండిపడ్డారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు పెంచుతామన్న జగన్ హామీ ఏమైందని నిలదీశారు. ఎలుకలు మద్యం తాగడం, పందికొక్కులు ఇసుక తినడం, పిచ్చివాళ్లు రథాలు తగలబెట్టడం వంటి విచిత్రాలన్నీ జగన్ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
హిందూ ధర్మంపై జగన్ కు ఏమాత్రం గౌరవం లేదన్న విషయం ఆయన వైఖరితోనే అర్థమవుతోందన్నారు. మంత్రులపై చెప్పులు విసిరే పరిస్థితి వచ్చినా, జగన్ అంతర్వేది ఘటనపై మౌనంగా ఉండటం సరికాదని హితవుపలికారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వైకాపాకి చెందిన మహిళను హత్య చేయించిన మంత్రి పేర్నినానిపై ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని అనిత డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: