పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే అధికంగా ఉన్నాయని నిరూపించేందుకు ఏ రాష్ట్రానికైనా వెళ్లి ధరలు పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సీఎం జగన్ సిద్ధమా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ప్రతిపక్షనేతగా జగన్ పెట్రోల్, డీజిల్ ధరలపై చేసిన ప్రసంగం వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
"చంద్రబాబు పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే యానాం వెళ్లాలన్నారు. మీ పాలనలో అవే ధరలు తెలుసుకోవడానికి దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లేందుకు మేము సిద్ధం." అని లోకేశ్ ట్వీట్ చేశారు.
పెట్రోల్, డీజిల్ పై గత రెండున్నరేళ్లలో వైకాపా ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి రూ.29వేల కోట్లు వసూలు చేసిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
"పెట్రోలియం, ప్లానింగ్ అనాలిసిస్ సెల్(పీపీఏసీ) వెబ్సైట్ ప్రకారం రాష్ట్రంలో ఏటా 350కోట్ల లీటర్ల డీజిల్, 150కోట్ల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. ప్రతినెలా రూ.వెయ్యి కోట్ల వరకూ పన్నుల రూపంలో వసూళ్లు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, హర్యాన వంటి రాష్ట్రాల్లో ఏపీకంటే పెట్రోల్, డీజిల్ వినియోగం ఎక్కువగా ఉన్నా.. ఆయా రాష్ట్రాల్లో పన్నుల ద్వారా సమకూర్చుకునే ఆదాయం ఏటా రూ.7వేలకోట్లకు మించిలేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.2 వరకూ పన్నుల భారం తగ్గిస్తే, తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పన్నులు పెంచుతూ జీవోల మీద జీవోలు ఇచ్చారు. ఈ వాస్తవాలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు." - పట్టాభి
ఇదీ చదవండి: