ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుపై జగన్ చేసిన అసంబద్ధ, అవాస్తవ ఆరోపణలే నేడు వైకాపా ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా మారాయని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని 45.72 మీటర్ల కన్నా తగ్గించేది లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నానంటున్న మంత్రి అనిల్.. ఆర్ అండ్ ఆర్ ని దశల వారీగా చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందని మండిపడ్డారు. పోలవరం విషయంలో ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
2018లో కేంద్ర బృందం ప్రాజెక్ట్ పర్యటనకు వచ్చే నాటికే గత తెదేపా ప్రభుత్వం, ఉభయగోదావరి జిల్లాల్లో లక్షా10వేల 355 ఎకరాలు సేకరించిందని గుర్తుచేశారు. కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంకా కేవలం 50వేల ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉందని వివరించారు. వైకాపా ప్రభుత్వానికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆర్ అండ్ ఆర్ కింద, మిగిలిన 50వేల ఎకరాలను సేకరించాలని డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తుత్తి సమీక్షలు చేయడం తప్ప, ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా, అటువంటి చర్య మచ్చుకైనా ఒక్కటి కూడా చేయలేదని విమర్శించారు.
ఇదీ చదవండి