మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లోని పంచాయతీల్లో స్థానిక పోరుకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ రెండుచోట్లా వైకాపా అక్రమాలకు పాల్పడుతోందంటూ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు లేఖ రాశారు. పుంగనూరు ఎస్సై ఉమామహేశ్వర్ రావు, చౌడేపల్లి రూరల్ ఎస్సై మధుసూధన్ రెడ్డి, సోమల ఎస్సై లక్ష్మీకాంత్, సదుం ఎస్సై ధరణిధర్, కొల్లూరు ఎస్సై శ్రీనివాసులు పై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.
మాచర్ల రూరల్ ఎస్సై బత్తవత్సల రెడ్డి, మాచర్ల ఎస్సై ఉదయలక్ష్మి, దుర్గి ఎస్సై ఎం. రామాంజనేయులు, వెల్దుర్తి ఎస్సై సుధీర్, కారంపూడి ఎస్సై రవికృష్ణ, రెంటచింతల ఎస్సై చల్లా సురేష్, నాగార్జున సాగర్ ఎస్సై పాల్ రవీందర్ పైనా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మాచర్ల, పుంగనూరులలో పనిచేస్తున్న ఎంఆర్ఓలు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులను బదిలీ చేయాలని కోరారు.
గ్రామ స్వరాజ్యం సాధించుకోడానికి క్షేత్రస్థాయిలో పంచాయతీ ఎన్నికలే ఓ సాధనమని, వైకాపా భౌతిక దాడులు, హింసతో ప్రజలు తమ హక్కుల్ని వినియోగించుకోలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. అభ్యర్థులపై వైకాపా దాడులు చేస్తుంటే, నామినేషన్లు వేయకూడదంటూ ఓ వర్గం పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమల మండలాల్లో తెదేపా బలపరిచిన అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. చౌడేపల్లి ఎస్ఐ మధుసూధన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని, లేఖలో పేర్కొన్నారు. పోలీసు అధికారుల చర్యలతో ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్ధులు రాజ్యాంగ హక్కులు కోల్పోతున్నారని, పోటీ చేయాలనుకునే అభ్యర్ధులకు రక్షణ కల్పించాలని లేఖలో చంద్రబాబు కోరారు.
ఇదీ చదవండి:
సర్పంచ్ అభ్యర్థి భర్త మృతి అనుమానాలకు తావిస్తోంది: చంద్రబాబు