హిందు మతం పట్ల ప్రభుత్వానికి ఉన్న పక్షపాత వైఖరితోనే దేవాలయాలను కొవిడ్ కేంద్రాలుగా తీసుకుంటున్నారని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగు దొడ్లు, ఇతరత్రా సౌకర్యాలు ఉండే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు రాష్ట్రంలో అనేకం ఉండగా..దేవాలయాలను కొవిడ్ కేంద్రాలుగా ఎంచుకోవటం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీశారు.
దేవాలయాల్లో అర్చకుల ఇబ్బందులను సీఎం జగన్ ఏనాడు పట్టించుకోలేదని రాంప్రసాద్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక 180కి పైగా దేవాలయాల్లో దాడులు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కొవిడ్ కేంద్రాలుగా మార్చటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తమ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'బ్లాక్ ఫంగస్ కేసులొస్తే.. సమాచారమివ్వాలి'