వైకాపా ప్రభుత్వ ఆరు నెలల పాలన వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టేందుకు తెదేపా సిద్ధమైంది. 21 అంశాలపై సమగ్ర చర్చ జరిగేందుకు రెండు వారాలైనా సమావేశాలు నిర్వహించాలని సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో పట్టబట్టనుంది. ప్రజల్లో వివిధ అంశాలపై వ్యక్తమవుతున్న నిరసనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గట్టిగా పోరాడేందుకు సిద్ధమైన తెలుగుదేశం.. పలు అంశాలపై దృష్టిసారించింది. వీటిల్లో వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి మొత్తం 21 అంశాలను సభలో లేవనెత్తాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాన అంశాలు..
- ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదల
- ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు
- ఇసుక ధరల పెంపు
- రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం
- రాజధాని అమరావతి పనులు నిలిపివేత
- సంక్షేమ పథకాల్లో కోత విధింపు
- గత ప్రభుత్వ పనులు నిలిపివేత, రద్దు
- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు
- పెట్టుబడులు వెనక్కి వెళ్లడం
- బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల విక్రయాలు
- రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం
- ఉపాధి హామీ బిల్లుల పెండింగ్
- ఇళ్ల నిర్మాణం నిలిపివేత
- మీడియాపై ఆంక్షల జీవో
- వలంటీర్ల నియామకంలో అక్రమాలు
నదుల అనుసంధానంతో పాటు విభజన హామీల అమలు, మహిళలపై అత్యాచారాలు, దాడుల, తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, రైతు రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వంపై గళం విప్పనున్నారు.
సభ దృష్టికి శనగ రైతుల సమస్యలు
శనగ రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నించేందుకు ప్రధాన ప్రతిపక్ష సభ్యులు సిద్ధమవుతున్నారు. ఆదరణ పథకాన్ని రద్దు చేయడంపైనా తెదేపా దృష్టి సారించింది. బీసీ మహిళలకు 15వేల ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటివరకూ అమలు చేయకపోవడంపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కియా కంపెనీలో ఉద్యోగాలు కల్పించామని సీఎం జగన్ చెప్పడాన్ని తెదేపా తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ విషయాన్నీ సభలో ప్రస్తావించనుంది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా సన్నద్ధమై సమావేశాలకు రావాలని, అన్ని రకాల చర్చల్లో చురుగ్గా పాల్గొని ప్రజల తరఫున పార్టీ గళం వినిపించాలని అధినేత చంద్రబాబు సూచించారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఆరు నెలల సమయం అయిపోయినందున ఇప్పుడు ప్రభుత్వ పనితీరుపై గట్టిగా నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: