వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల నిధుల్లో కోతలు పెట్టి అధికార పార్టీ సంబరాలు చేసుకుంటోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన ఆయన.. బడ్జెట్‌లో బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు తక్కువగా కేటాయించిందని మండిపడ్డారు. కొత్త ఇసుకపై విధానం తెచ్చి... భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆక్షేపించారు. మద్యపాన నిషేధం పేరుతో...ధరలు పెంచి దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిలిపివేశారని ధ్వజమెత్తారు. విశాఖలో వైకాపా నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
'గత రెండు బడ్జెట్లలో బీసీలకు ఎన్ని నిధులు కేటాయించారు..? బీసీ కార్పొరేషన్లకు 17నెలల్లో ఎన్ని నిధులు ఇచ్చారు..? ఇసుకపై మంచి విధానం తెస్తామని నమ్మించి, మొత్తం ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఏడాదిన్నరగా ఇసుక రాష్ట్రంలో సజావుగా దొరుకుతోందా..? మద్యపాన నిషేధం పెడుతున్నామని... మూడు నాలుగు రెట్లు మద్యం ధరలు పెంచేశారు. అన్నిరాష్ట్రాలలో దొరికే బ్రాండ్లు ఇక్కడ దొరకకుండా చేసి... నాసిరకం బ్రాండ్లతో ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. రోజువారీ డబ్బు సంచుల లెక్కల్లో వైకాపా నాయకులు మునిగి తేలుతున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ అయినా విశాఖకు వచ్చిందా..?' - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి