విత్తనాల సరఫరాలో వైకాపా ప్రభుత్వ వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండ మార్కెట్ యార్డులో నిన్న విత్తనాల కోసం వెళ్లి తోపులాటలో రైతు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో విత్తనాల పంపిణీలో ఇది రెండో దుర్ఘటన అన్నారు. రాయదుర్గంలో 2 నెలల క్రితం విత్తనాల కోసం క్యూలైన్‌లో నిలబడి ఈశ్వరప్ప మృతి చెందారని గుర్తుచేశారు. ఈ ఖరీఫ్‌లో, రబీలో విత్తనాల పంపిణీ ప్రణాళిక లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీలో పంపిణీ చేయాల్సిన విత్తనాలు తెలంగాణలో చేశారని మీడియాలోనే చూశామన్నారు. విత్తనాలు, పంటరుణాలు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేయట్లేదని ధ్వజమెత్తారు. అనంతపురంలోనే గత 3 నెలల్లో 21 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వంద రోజులు కాకుండానే రాష్ట్రంలో 100కు పైగా అన్నదాతల ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. తోపులాటలో సిద్ధప్ప, ఈశ్వరప్ప మృతికి వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.